పవన్ కల్యాణ్ నటుడైతే, చంద్రబాబు సహజ నటుడు: సజ్జల వ్యంగ్యం

15-04-2021 Thu 15:17
  • తిరుపతి ఉప ఎన్నికపై సజ్జల ప్రెస్ మీట్
  • పవన్, చంద్రబాబులను గత ఎన్నికల్లో ఛీకొట్టారని వెల్లడి
  • ఇప్పటికీ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని వ్యాఖ్యలు
  • అచ్చెన్న వీడియో అంశం ప్రస్తావన
  • చంద్రబాబుది సిగ్గులేని జన్మ అని విమర్శలు
Sajjala terms Pawan Kalyan an actor and Chandrababu a natural actor

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా సంక్షోభం వల్ల అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ ప్రభుత్వం వెనుకంజ వేయలేదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికపైనా స్పందించారు. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు.

పవన్ కల్యాణ్ నటుడైతే, చంద్రబాబు సహజ నటుడు అని వ్యంగ్యం ప్రదర్శించారు. గత ఎన్నికల్లో వారిని ప్రజలు ఛీ కొట్టారని, అయినప్పటికి వారిలో మార్పు రాలేదని విమర్శించారు. 2014లో ఈ పార్టీలు ఏంచేశాయో ఒక్కసారి గమనించాలన్నారు. మోదీతో కలిసి నాడు తిరుపతిలో ప్రత్యేక హోదా హామీతో సహా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఏమయ్యాయో తిరుపతి ఓటర్లు గుర్తించాలన్నారు.

గతంలో కలిసి ఉన్న టీడీపీ, జనసేన ప్రస్తుతం విడిపోయి తిరుపతి ఉప ఎన్నిక కోసం వచ్చినా, ఈ రెండు పార్టీలు లోపాయికారీగా తెరవెనుక కలిసే ఉన్నాయని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, బీజేపీ ఏపీ ప్రజలకు ఏంచేశాయో చెప్పలేకపోతున్నాయని సజ్జల విమర్శించారు.

ఈ క్రమంలో సజ్జల... ఇటీవల వెలుగుచూసిన అచ్చెన్నాయుడు వీడియో వ్యవహారాన్ని ప్రస్తావించారు. లోకేశ్ దెబ్బకే పార్టీ నాశనం అయిందని అచ్చెన్న వ్యాఖ్యానించడం అందరూ చూశారని వెల్లడించారు. పార్టీ భావి అధ్యక్షుడిగా భావిస్తున్న తన కుమారుడిపై అచ్చెన్న అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ అతడ్ని చంద్రబాబు మళ్లీ పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే అంతకంటే సిగ్గులేని జన్మ మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చెబుతున్నాడని అన్నారు. రాళ్ల దాడి జరిగిందంటున్న చంద్రబాబు డ్రామాను ప్రజలు గమనించారని, తిరుపతిలో వైసీపీదే విజయం ఖాయమని సజ్జల స్పష్టం చేశారు.