సీఎం పదవిని ఇస్తామన్నా వద్దని చెప్పాను: జానారెడ్డి

15-04-2021 Thu 14:43
  • కాంగ్రెస్ ను చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించాం
  • తెలంగాణ ఇస్తామని సోనియా చెప్పిన తర్వాతే రాజీనామాలు వెనక్కి తీసుకున్నాం
  • మావోయిస్టులతో జరిపిన చర్చలకు కూడా నేనే కారణం
I rejected CM post for Telangana state says Jana Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తమ కాంగ్రెస్ పార్టీని చావు నోట్లో పెట్టి తెలంగాణను తాము సాధించామని చెప్పారు.

తెలంగాణ ఇవ్వకూడదని అప్పటి ఏపీ మంత్రులు రాజీనామా చేస్తే... రాష్ట్ర సాధన కోసం తెలంగాణకు చెందిన మంత్రులను కూడగట్టి తాను రాజీనామాలు చేయించానని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియాగాంధీని తాము కోరామని చెప్పారు. తెలంగాణను ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చిన తర్వాతే రాజీనామాలను వెనక్కి తీసుకున్నామని తెలిపారు.

ఒకానొక దశలో సీఎం పదవి ఇస్తామని చెప్పారని... అయితే రాష్ట్ర సాధనే తనకు ముఖ్యమని సోనియాకు చెప్పానని జానారెడ్డి చెప్పారు. మంత్రి పదవి కోసం కూడా తాను ఏనాడూ ఎవరినీ అడగలేదని తెలిపారు. మావోయిస్టులతో జరిపిన చర్చలకు కూడా తానే కారణమని చెప్పారు. పదవుల కోసం పాకులాడటం తన జీవితంలో లేదని అన్నారు. తెలంగాణ సాధనకు బీజేపీ కూడా సహకరించిందని చెప్పారు. తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేశారని తెలిపారు.