New Delhi: ఢిల్లీలో వారాంతపు​ కర్ఫ్యూ విధిస్తున్నాం: ముఖ్యమంత్రి కేజ్రీవాల్

Arvind Kejriwal Announces Weekend Curfew in Delhi
  • కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం 
  • జిమ్ లు, షాపింగ్ మాళ్లు బంద్
  • రెస్టారెంట్లలో తినడం నిషిద్ధం
  • కేవలం పార్శిళ్లకే అనుమతి
  • పెళ్లిళ్లు, శుభకార్యాలకు కర్ఫ్యూ పాస్ తప్పనిసరి
  • ప్రజా క్షేమం కోసమేనన్న సీఎం
కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి వారాంతపు కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసరాలు, నిత్యావసరాలు తప్ప మిగతా అవసరం లేని కార్యకలాపాలన్నింటినీ శని, ఆదివారాల్లో నిషేధిస్తున్నట్టు చెప్పారు.

ఆడిటోరియాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, జిమ్ లు, స్పాలన్నింటినీ బంద్ పెట్టనున్నారు. వారాంతపు సంతలు కొనసాగుతాయని, అయితే, ఆంక్షల నడుమ వాటిని నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక రోజు ఒకే సంతకు అనుమతి ఉంటుందన్నారు.

సామాజిక, రాజకీయ, మత సమూహాలకు అనుమతి లేదని కేజ్రీవాల్ చెప్పారు. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఫిక్స్ చేసిన పెళ్లిళ్లు, శుభకార్యాలను పాస్ లు తీసుకుని నిర్వహించుకోవచ్చని ఆయన చెప్పారు.

 ఈ ఆంక్షలన్నీ ప్రజా క్షేమం కోసమేనని, ఆంక్షలు అసౌకర్యంగా అనిపించినా కరోనా కేసులను తగ్గించేందుకు తప్పదని పేర్కొన్నారు. అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాకే ఆంక్షలు విధిస్తున్నామని చెప్పారు.

ఇవీ ఆంక్షలు

  • వారాంతాల్లో కేవలం అత్యవసర, నిత్యావసరాలకే అనుమతి
  • పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు కర్ఫ్యూ పాస్ లు తప్పనిసరి
  • జిమ్, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాళ్లు పూర్తిగా బంద్
  • 30 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లకు అనుమతి
  • ఏదైనా ఒక ప్రాంతంలో ఒక రోజు ఒకే మార్కెట్
  • రెస్టారెంట్లలో తినడానికి లేదు. కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతి
New Delhi
Arvind Kejriwal
Weekend Curfew
COVID19

More Telugu News