COVAXIN: ఎంత నిర్లక్ష్యం?... తొలి డోసు కొవాగ్జిన్ ఇచ్చి, రెండో డోసు కొవిషీల్డ్ ఇచ్చారు!

  • యూపీలోని మహరాజ్ గంజ్ జిల్లాలో ఘటన
  • గత నెలలో కొవాగ్జిన్ డోసు తీసుకున్న ప్రభుత్వ డ్రైవర్
  • రెండో డోసు కోసం వెళితే చేదు అనుభవం
  • కొవిషీల్డ్ డోసు ఇచ్చిన వైద్య సిబ్బంది  
Uttar Pradesh medical staff negligence in giving right dose

ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠ వంటి ఘటనకు పాల్పడ్డారు. కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తికి తొలి డోసు కొవాగ్జిన్ ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది... రెండో డోసు కొవిషీల్డ్ ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

మహరాజ్ గంజ్ జిల్లా ముఖ్య అభివృద్ధి అధికారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న ఉమేశ్ గత నెలలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. అతడికి తొలి డోసు కొవాగ్జిన్ ఇచ్చారు. తాజాగా రెండో డోసు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఉమేశ్ కు అక్కడి సిబ్బంది కొవాగ్జిన్ ఇవ్వాల్సింది పోయి కొవిషీల్డ్ డోసు ఇచ్చారు. ఈ సంగతి గ్రహించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఉమేశ్ తో పాటు గత నెలలో కొవాగ్జిన్ డోసు తీసుకున్న మిగతా డ్రైవర్లు చందన్, మదన్ లకు రెండో డోసు నిలిపివేశారు. లేకుంటే వారిద్దరికీ కూడా కొవిషీల్డ్ డోసునే ఇచ్చేవారు.

సిబ్బంది నిర్లక్ష్యంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏకే శ్రీవాస్తవ వివరణ ఇచ్చారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. అయితే, తొలి డోసు కొవాగ్జిన్, రెండో డోసు కొవిషీల్డ్ తీసుకున్నప్పటికీ ఉమేశ్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని, ఇది ఊరట కలిగించే విషయమని అన్నారు. ఇకపై వైద్య సిబ్బంది జాగరూకతతో వ్యవహరించాలని, తొలి డోసు ఏదైతే ఇచ్చారో, రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

యూపీలో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. ఇటీవల కరోనా టీకా కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళలకు అక్కడి సిబ్బంది రేబీస్ టీకాలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది.

More Telugu News