Rupee: సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​: ఆసియాలో ఉన్నత స్థానం నుంచి పతనం స్థాయికి రూపాయి!

  • ఈ నెలలో 2.6 శాతం పడిపోయిన విలువ
  • ప్రస్తుతం డాలర్ విలువ 75 రూపాయలు
  • ఏడాది చివరి నాటికి 76కు పెరిగే ఛాన్స్ ఉందన్న ఫెడరల్ బ్యాంక్  
  • విదేశీ మారక నిల్వలతో ఆర్బీఐ బయటపడేయొచ్చన్న ఆశాభావం
Rupee Goes From Asias Best To Worst Performing In 2 Weeks On Covid Surge

రూపాయిపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీగానే పడింది. మొన్నటిదాకా ఆసియాలోనే అత్యున్నత స్థానంలో నిలిచిన మన కరెన్సీ.. ఇప్పుడు అత్యంత దారుణ పతనాలను చవిచూస్తోంది. ఈ వారంలో డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం రూపాయితో డాలర్ విలువ 75కు పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి అది 76కు పెరిగే అవకాశం లేకపోలేదని ఫెడరల్ బ్యాంక్ అంచనా వేసింది.

మార్చి చివరి నాటికి 0.1 శాతమే పడిపోయిన రూపాయి విలువ.. ఏప్రిల్ లో ఇప్పటిదాకా 2.6 శాతం పతనమైంది. అయితే, కరెంట్ ఖాతాల మిగులు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం, విదేశీ నిధులు భారీగా రావడం వంటి కారణాలతో గత మూడు నెలల్లో ఆసియాలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో పతనం దిశగా సాగుతోంది. ఇటు డాలర్ బాండ్ల విలువ కూడా పడిపోయింది.

ఇక, పెరుగుతున్న నిత్యావసరాల ధరలూ కరెంట్ ఖాతాల్లో లోటుకు కారణమవుతాయని, దాని వల్ల రూపాయి మరింత బలహీన పడే ప్రమాదముందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాని వల్ల దేశంలో డాలర్ నిల్వలు కరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఆర్థిక వ్యవస్థపై మునుపటి కన్నా మరింత ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని ముంబైలోని ఫెడరల్ బ్యాంక్ ట్రెజరీ అధిపతి వి.లక్ష్మణన్ చెప్పారు. కరోనా ప్రభావాన్ని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని అన్నారు. అయితే, ప్రస్తుతమున్న విదేశీ మారక నిల్వలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆ గడ్డు పరిస్థితులను అధిగమిస్తుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

‘‘రూపాయి విలువను పెంచేందుకు ప్రస్తుతమున్న డాలర్లను ఆర్బీఐ అమ్మే అవకాశాలున్నాయి’’ అని ఎఫ్ఎక్స్ ఎమర్జింగ్ మాక్రో స్ట్రాటజీ రీసెర్చ్ హెడ్ ఆశిష్ అగర్వాల్ చెప్పారు. అయితే, ఈ ఏడాది చివరికి డాలర్ తో రూపాయి మారకం విలువ 73కి తిరిగిచేరుకోవచ్చని ఆయన అంచానా వేశారు.    

More Telugu News