వాట్సాప్ చాటింగ్ లపై ‘మూడో కన్ను’.. డేటా చోరీ చేస్తున్న దుండగులు

15-04-2021 Thu 12:41
  • మహిళల భద్రతకు భంగమన్న ఆందోళన
  • ఆలుమగలు, ప్రేమికుల రహస్య వివరాల సేకరణ
  • పిల్లలపై నిఘాకూ తల్లిదండ్రుల కోసం యాప్
  • కొన్ని వెబ్ సైట్ల ద్వారా కూడా సమాచారం చోరీ
  • ట్రేస్డ్ అనే సంస్థ పరిశీలనలో షాకింగ్ విషయాలు
WhatsApp has status flaw stalkers are using it to track women online using automated apps
గోప్యత, భద్రత విషయంలో వాట్సాప్ విఫలమైందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. అవును, మనం ఎప్పుడు ఆన్ లైన్ లో ఉన్నాం? ఎవరెవరితో మాట్లాడాం? ఏం మాట్లాడాం? వంటి వివరాలన్నింటిపైనా మనకు తెలియని ‘మూడో కన్ను’ ఒకటి నిఘా వేస్తూ ఉండొచ్చు. ఆ డేటానంతా చోరీ చేసేయొచ్చు. వాటితో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడొచ్చు. ట్రేస్డ్ అనే ఓ సంస్థ పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరీ ముఖ్యంగా మహిళల గోప్యత, భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కొందరు సైబర్ నేరగాళ్లు, దుండగులు వాట్సాప్ ఆన్ లైన్ స్టేటస్ ట్రాకర్ వెబ్ సైట్లు, యాప్ ల ద్వారా మహిళలను ట్రాక్ చేస్తున్నారని ట్రేస్డ్ తేల్చింది. ఎవరు ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? వంటి వివరాలనూ వాటి ద్వారా దొంగిలించేస్తున్నారని, ఫలితంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఆలుమగలు, ప్రేమికుల మధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. దాంతో పాటు పిల్లల మీద తల్లిదండ్రులూ ఇలాంటి యాప్ లతో నిఘా పెడుతున్నారని వెల్లడించింది.

ఇలాంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని అందులో నిఘా పెట్టాలనుకున్న వ్యక్తి ఫోన్ నంబర్ ను టైప్ చేస్తే సమాచారం మొత్తం వచ్చేస్తుందని ట్రేస్డ్ పేర్కొంది. వాటితో పాటు కొన్ని వెబ్ సైట్ల ద్వారా కూడా కొందరు ట్రాకింగ్ కు పాల్పడుతున్నారని తెలిపింది. అయితే, ఆయా యాప్ లు, వెబ్ సైట్ల పేర్లను మాత్రం సంస్థ వెల్లడించలేదు. వాటికి అనవసర ప్రచారం కల్పించకూడదన్న ఉద్దేశంతోనే వాటి పేర్లను వెల్లడించడం లేదని సంస్థ పేర్కొంది.

కాగా, ఇలాంటి యాప్ లపై గూగుల్ ప్లే స్టోర్ స్పందించింది. కేవలం పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు మాత్రమే కొన్ని యాప్ లకు అనుమతులున్నాయని, అది కూడా పరిమితమేనని చెప్పింది. అయితే, భార్య లేదా భర్తకు సంబంధించిన స్టేటస్ ను మాత్రం ట్రాక్ చేసేందుకు అవకాశం లేదని చెప్పింది. వారికి తెలియకుండా ట్రాక్ చేసేందుకు అవకాశం లేదని తెలిపింది.