తాత్కాలిక కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు!

15-04-2021 Thu 12:35
  • ఢిల్లీ, ముంబైలలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
  • కరోనా పేషెంట్లతో నిండిపోయిన ఆసుపత్రులు
  • అదనపు బెడ్ల కోసం స్టార్ హోటళ్లను తీసుకుంటున్న ఆసుపత్రులు
Star hotels turns to temporary Covid hospitals in Mumbai and Delhi

దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. శ్మశానవాటికలకు పెద్ద సంఖ్యలో మృతదేహాలు చేరుతున్నాయి. ఈ స్థాయిలో మృతదేహాలు రావడాన్ని తాము ఎప్పుడూ చూడలేదని ఢిల్లీలోని ఓ శ్మశానవాటిక సిబ్బంది చెప్పడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

మరోవైపు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో ఆసుపత్రులకు వస్తున్న వారికి కూడా బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని, మరో 6 వారాల పాటు ఉద్ధృతి కొనసాగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, బెడ్స్ కు మరింత డిమాండ్ ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలలో ఫైవ్ స్టార్ హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చారు. దీనివల్ల ఎక్కువ మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది.

పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లకు మాత్రం ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తారు. తక్కువ కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్లను మాత్రం స్టార్ హోటల్స్ కు తరలిస్తారు. ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, ఔషధాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. ముంబైలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వారికి రోజుకు రూ. 4 వేలు ఛార్జ్ చేస్తారు. పేషెంట్ కు తోడుగా ఉండాలనుకునేవారు మరో గది కావాలనుకుంటే రోజుకు రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది.