పవన్ కల్యాణ్ హీరోయిజంకు తగ్గట్టుగా సినిమా తీయడం నాకు చేత కాదు: రామ్ గోపాల్ వర్మ

15-04-2021 Thu 12:15
  • పవన్ కు నేను పెద్ద అభిమానిని
  • పవన్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా తీయలేను
  • జోనర్ చిత్రాలనే నేను ఎక్కువగా తెరకెక్కిస్తాను
It is not possible for me to make a movie with Pawan Kalyan says Ram Gopal Varma

సినిమాల పరంగా పవన్ కల్యాణ్ కు తాను పెద్ద అభిమానినని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. పవన్ సినిమాలను తాను ఎక్కువగా చూడలేదని... తాజా చిత్రం 'వకీల్ సాబ్' ను కూడా చూడలేదని చెప్పారు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూశానని, చాలా బాగుందని చెప్పారు. సినిమాకు వచ్చిన రివ్యూల గురించి కూడా విన్నానని తెలిపారు. పవన్ హీరోగా సినిమా చేయడం తనకు చేత కాదని అన్నాారు.

పవన్ కు ఉన్న ఇమేజ్, హీరోయిజం, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఆయన అభిమానుల అంచనాలను అందుకునే విధంగా తాను సినిమా చేయలేనని చెప్పారు. హీరోయిజం చూపించే కమర్షియల్ చిత్రాల కంటే జోనర్ చిత్రాలను తాను ఎక్కువగా తెరకెక్కిస్తానని... పవన్ తో సినిమా చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు.

తాను తీసే సినిమాలలో స్టార్ హీరోలను తీసుకుంటే అది వాళ్లకే కాకుండా సినిమాకు కూడా మంచిది కాదని అన్నారు. 'దెయ్యం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'దెయ్యం' సినిమాలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.