India: మహమ్మారి సునామీ... ఇండియాలో 2 లక్షల కొత్త కేసులు!

  • బుధవారం 2,00,739 కొత్త కేసులు
  • కరోనా కారణంగా మరణించిన వారు 1,037 మంది
  • మహారాష్ట్రలో 58 వేలకు పైగా కేసులు
  • తగ్గుతున్న రికవరీల సంఖ్యతో ఆందోళన
India Records Nearly 2 Lakh New Corona Cases

ఇండియాలో కరోనా మహమ్మారి సునామీని తలపిస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను అధిగమిస్తూ, రోజుకు రెండు లక్షలకు చేరువైంది. గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 2,00,739 కాగా, 1,037 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్త కేసుల్లో 58,952 కేసులు మహారాష్ట్రలో, ఢిల్లీలో 17,282 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇప్పటికే ఇండియాలో కరోనా రెండో వేవ్ కొనసాగుతుండగా, కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే, రికవరీల సంఖ్య తక్కువగా ఉండటం అధికారులు, ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు, 12వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, మహారాష్టలో 35.78 లక్షలు, కేరళలో 11.72 లక్షలు, కర్ణాటకలో 10.94 లక్షలు, తమిళనాడులో 9.40 లక్షలు, ఆంధ్రప్రదేశ్ లో 9.28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 13.88 కోట్ల మందికి పైగా వైరస్ సోకగా, 11 లక్షల మందికి పైగా మరణించారు. 19.84 కోట్ల మందికి పైగా రికవరీ అయ్యారు. ప్రస్తుతానికి యూఎస్ అత్యధిక కేసులు (3.21 కోట్లు) నమోదైన దేశంగా ఉన్నప్పటికీ, ఇండియాలో ఇదే విధంగా కరోనా ఉద్ధృతి కొనసాగితే, ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు ఇండియాకు ఎన్నో రోజులు పట్టబోదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News