Corona Virus: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్.. ఒక్క రోజులో 6 లక్షల మందికిపైగా టీకా

Over 6 lakh people vaccinated in AP in single day
  • నిన్న 6,17,182 మందికి టీకా
  • దేశంలోనే ఈ స్థాయి వ్యాక్సినేషన్ తొలిసారి
  • కేంద్రం నుంచి వచ్చిన డోసుల మొత్తం పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ రికార్డుస్థాయిలో కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు రోజుకు సగటున 1.25 లక్షల మందికి మాత్రమే టీకా పంపిణీ జరగ్గా, నిన్న రికార్డుస్థాయిలో టీకాలు వేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

అలాగే, కేంద్రం నుంచి వచ్చిన 6.40 లక్షల కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను పంపిణీ చేసినట్టు తెలిపింది. ఒక్క రోజులో ఇన్ని లక్షల టీకాలు ఇవ్వడం దేశంలోనే ఇది తొలిసారని వివరించింది. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం డోసులను పంపిణీ చేయడంతో నేటి వ్యాక్సినేషన్ సంగతేంటన్నది తెలియరాలేదు. కాగా, గతంలో రాజస్థాన్, మహారాష్ట్రలలో రోజుకు 2 లక్షల మందికి టీకా ఇచ్చారు. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును ఏపీ అధిగమించింది.
Corona Virus
Vaccination
Andhra Pradesh

More Telugu News