రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్‌తో‌ కేంద్రం ఒప్పందం!

14-04-2021 Wed 22:06
  • కేంద్రమంత్రి తోమర్‌ ఆధ్వర్యంలో సంతకాలు
  • పెట్టుబడి వ్యయం తగ్గించడమే వ్యూహం
  • 6 రాష్ట్రాల్లోని 100 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టు
  • కొవిడ్‌ సంక్షోభంలోనూ రాణించిన వ్యవసాయ రంగం
Centre signs an MoU With Microsoft

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ శాఖ..  సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి.. పంట కోత తదుపరి నిర్వహణకు సంబంధించిన మెలకువలతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద ఆరు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 గ్రామాల్లో దీన్ని అమలు చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆధ్వర్యంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ సందర్భంగా తోమర్‌ మాట్లాడుతూ... సాగుకు సాంకేతికతను జోడించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చని, యువతను వ్యవసాయం దిశగా మళ్లించవచ్చని తెలిపారు. కేంద్రం ఏటా రూ.6 వేలు రైతుల ఖాతాలో జమచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తోమర్‌ గుర్తుచేశారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలోనూ వ్యవసాయ రంగం రాణించిందని  తెలిపారు.