కరోనా విలయతాండవం.. స్కూళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, బాంకెట్ హాళ్లను ఆసుపత్రులకు అటాచ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం!

14-04-2021 Wed 21:28
  • ఢిల్లీలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కేసులు
  • తాజా నిర్ణయంతో 875 బెడ్లు అందుబాటులోకి వస్తాయన్న ఢిల్లీ ప్రభుత్వం
  • డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆయా ఆసుపత్రులు కేటాయించాలని ఆదేశం
Delhi govt attaches schools and sports complexes to hospitals amid raise in Corona cases

ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులతో కరోనా పేషెంట్లకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, బాంకెట్ హాళ్లను ఆసుపత్రులకు అటాచ్ చేసింది. ఈ నిర్ణయం వల్ల అదనంగా 875 బెడ్లు అందుబాటులోకి వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

వీటన్నింటినీ లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రి, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రి, దీప్ చంద్ బంధు హాస్పిటల్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ కు అటాచ్ చేశారు. అదనపు స్థలాన్ని ఈ ఆసుపత్రులకు కేటాయించామని... వీటికి డాక్టర్లను, వైద్య సిబ్బందిని, మౌలికవసతులను కేటాయించడం ఆయా ఆసుపత్రుల బాధ్యత అని ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలో గత ఆదివారం నుంచి ప్రతి రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 13,500 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బెడ్ల కొరతను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోంది.