గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోంది: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

14-04-2021 Wed 21:00
  • తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది
  • ఆర్థిక సమస్యలు వస్తాయనే లాక్ డౌన్ విధించడం లేదు
  • జాగ్రత్తగా ఉండకపోతే తెలంగాణ మరో మహారాష్ట్ర అవుతుంది
Corona is spreading via air also says Telangana Public Health Director

కరోనా వైరస్ విస్తరణకు సంబంధించి మరో ఆందోళనకరమైన విషయాన్ని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. గాలి ద్వారా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు బయట ఉన్నప్పుడు మాత్రమే మాస్కులు వేసుకోవాలని చెప్పామని... ప్రస్తుత పరిస్థితిలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని సూచించారు.

ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగిలిన వారికి కూడా చాలా వేగంగా గంటల వ్యవధిలోనే సోకుతుందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. మరో నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పారు.

లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుందనే ఉద్దేశంతో దాన్ని విధించడం లేదని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, చాలా వేగంగా వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే... తెలంగాణ కూడా మరో మహారాష్ట్రలా తయారవుతుందని హెచ్చరించారు.