కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల

14-04-2021 Wed 20:06
  • దళితులను కేసీఆర్ మోసం చేశారు
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును ఎందుకు పెట్టలేదు?
  • అంబేద్కర్ జయంతిని నిర్వహించడానికి కరోనా నిబంధనలు అడ్డు వచ్చాయా?
YS Sharmila fires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. తెలంగాణ వస్తే దళిత వ్యక్తిని తొలి సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత దళితులను మోసం చేశారని విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను లోటస్ పాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దళిత సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం రాజయ్యపై ఒక్క ఆరోపణ వచ్చిన వెంటనే ఆయనను కేసీఆర్ పదవి నుంచి తొలగించారని షర్మిల అన్నారు. మంత్రి మల్లారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారానికి అడ్డురాని కోవిడ్ నిబంధనలు... అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడానికి మాత్రం అడ్డు వచ్చాయా? అని దుయ్యబట్టారు.

చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును వైయస్ రాజశేఖరరెడ్డి పెట్టారని... కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును కేసీఆర్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. మరోవైపు, రేపు షర్మిల నిరాహారదీక్షను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.