పవన్ కల్యాణ్ ను జూనియర్ ఎన్టీఆర్ కౌగిలించుకుని అభినందించాడు: ప్రకాశ్ రాజ్

14-04-2021 Wed 19:29
  • సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం
  • సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు
  • తారక్ కు ఎంతో నచ్చిందన్న ప్రకాశ్ రాజ్
Junior NTR congratulated Pawan Kalyan says Prakash Raj

పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శల ప్రశంసలను కూడా అందుకుంటోంది. మరోవైపు నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతగానో నచ్చిందని తెలిపారు. నేరుగా పవన్ కల్యాణ్ ను కలిసి, కౌగిలించుకుని అభినందనలు తెలియజేశాడని చెప్పారు. 'వకీల్ సాబ్' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రకాశ్ రాజ్ కు, తనకు మధ్య రాజకీయ పరమైన విభేదాలు ఉండొచ్చని... కానీ, సినిమాల కోసం తాము కలసి పని చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. 'బద్రి' సినిమా నుంచి తనకు పవన్ తో పరిచయం ఉందని, చిరంజీవిని కూడా తాను కలుస్తుంటానని తెలిపారు.

ప్రజా సేవ చేసేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చారని... తొలి ప్రయత్నంలో ఓటమిపాలైనప్పటికీ ప్రజల తరపున గొంతుకను వినిపిస్తున్నారని ప్రశంసించారు. పవన్ ను తాను ఇష్టపడేందుకు ఇదే ప్రధాన కారణమని చెప్పారు. ప్రస్తుతం ఆయన మరో పార్టీతో కలిసి పని చేయడం తనకు నచ్చలేదని... అయితే, సినిమా షూటింగ్ లో ఇలాంటి విషయాలు తమ మధ్య చర్చకు రాలేదని అన్నారు.