బన్నీ కోసం గట్టిగానే ట్రై చేస్తున్న 'దిల్' రాజు!

14-04-2021 Wed 17:55
  • 'పుష్ప' షూటింగులో బిజీగా బన్నీ 
  • కొరటాలతో చేయడానికి మరింత సమయం
  •  'ఐకాన్'ను లైన్లో పెట్టే పనిలో దిల్ రాజు
Dil Raju met Allu Arjun for Icon Movie

దిల్ రాజు - వేణు శ్రీరామ్ కలిసి బన్నీ కథానాయకుడిగా 'ఐకాన్' అనే సినిమాను చేయాలనుకున్నారు. 'ఐకాన్' టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు. అయితే అప్పుడు బన్నీ ఉన్న పరిస్థితి కారణంగా తనకి తప్పకుండా హిట్ ఇచ్చే దర్శకుడు కావాలనే ఉద్దేశంతో, వెయిట్ చేసి మరీ త్రివిక్రమ్ తో 'అల వైకుంఠపురములో' సినిమాను చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఇక 'ఐకాన్' చేసేస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఎలాంటి హడావిడి లేకుండానే ఆయన సుకుమార్ కి పచ్చ జెండా ఊపేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు 'పుష్ప' రూపొందుతోంది.

ఇక తాజాగా దిల్ రాజు - వేణు శ్రీరామ్ కలిసి 'వకీల్ సాబ్' సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా చూసినవాళ్లకి వేణు శ్రీరామ్ టాలెంట్ పై నమ్మకం కుదిరింది. అయితే 'పుష్ప' తరువాత కొరటాల శివతో సినిమా చేయాలని బన్నీ అనుకున్నాడు. కానీ 'ఆచార్య' తరువాత కొరటాల శివ .. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. దాంతో గతంలో ఆరంభంలోనే ఆగిపోయిన 'ఐకాన్' ప్రాజెక్టును మళ్లీ మొదలుపెట్టాలనే ఆసక్తితో దిల్ రాజు ఉన్నాడట. బన్నీని ఒప్పించి ఆయన డేట్స్ తీసుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడని అంటున్నారు. దిల్ రాజు ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.