'ఆదిపురుష్' సినిమా ఆగలేదు.. దర్శకుడి వివరణ!

14-04-2021 Wed 17:32
  • ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఆదిపురుష్' 
  • గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ 
  • కరోనా కారణంగా ఆగిపోయిందంటూ వార్తలు 
  • అలాంటిదేమీ లేదన్న దర్శకుడు ఓం రౌత్
Adipurush director gives clarity on rumours

పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా వున్నాడు. వీటిలో 'రాధే శ్యామ్' ముగింపు దశలో వుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్'.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఆదిపురుష్' సెట్స్ మీద వున్నాయి.

స్ట్రెయిట్ హిందీ సినిమాగా రూపొందుతున్న 'ఆదిపురుష్' షూటింగ్ గత కొంత కాలంగా ముంబైలో సెట్స్ లో జరుగుతోంది. అయితే, ఇటీవల ముంబైలో మళ్లీ కరోనా కేసులు విజృంభించడంతో ఈ చిత్రం షూటింగును నిలిపివేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు దర్శకుడు ఓం రౌత్ దృష్టికి వెళ్లడంతో తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.

"షూటింగ్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. అలాగే, మా సినిమా టీమ్ లో ఒకరికి కరోనా సోకిందంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. ఇప్పటివరకు మాలో ఎవరికీ కరోనా సోకలేదు. పూర్తి కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం" అంటూ దర్శకుడు ఓం రౌత్ పేర్కొన్నారు.

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ కృతి సనన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.