మాస్క్ ధరించని వారిపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం!

14-04-2021 Wed 16:20
  • కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామన్న రాచకొండ కమిషనర్
  • సీసీ కెమెరాల ఆధారంగా కూడా మాస్కులు ధరించని వారిని గుర్తిస్తామని హెచ్చరిక
  • నిన్న 832 మందిపై కేసులు నమోదు చేశామన్న భగవత్
Hyderabad police strict action on maskless people

తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కరోనా పేషెంట్లకు హైదరాబాద్ ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు కూడా దొరకని పరిస్థితి ఆందోళనను పెంచుతోంది. ఈ నేపథ్యంలో కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు నగర పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... మాస్క్ ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని, రూ. 1000 జరిమానా విధిస్తున్నామని హెచ్చరించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా మాస్కులు లేని వారిని గుర్తించి, కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని మహేశ్ భగవత్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఒక్కరోజే మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. పోలీసులు కూడా ప్రధాన కూడళ్లలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.