శంకర్ దర్శకత్వంలోనే బాలీవుడ్ 'అపరిచితుడు'

14-04-2021 Wed 14:29
  • విక్రమ్ ను నిలబెట్టిన 'అపరిచితుడు'
  • అప్పట్లోనే రికార్డు స్థాయి వసూళ్లు
  • ఈ రీమేక్ పై మనసు పడిన రణ్వీర్ సింగ్    
Shankar is doing remake of Aparichitudu movie in Bollywood

శంకర్ దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాలలో 'అపరిచితుడు' ఒకటి. విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా, అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. సమాజంలో అడుగడుగునా అవినీతి .. నిర్లక్ష్యం ఎలా ఉన్నాయనే విషయాన్ని తెరపై శంకర్ ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ సినిమాలో విక్రమ్ పాత్రను శంకర్ డిజైన్  తరహాలో, మరే దర్శకుడు అలాంటి ప్రయోగం చేయలేకపోయాడు. ఇంతకాలానికి మళ్లీ ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'అపరిచితుడు' రీమేక్ పై రణ్వీర్ సింగ్ దృష్టి పెట్టాడనీ, ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఆయన శంకర్ ని కలిసి మాట్లాడినట్టుగా చెప్పుకున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం.

శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ వారు నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోగా శంకర్ .. చరణ్ సినిమాను పూర్తి చేస్తాడన్న మాట!