ప‌వ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌పోతున్నారు: వైసీపీపై సోము వీర్రాజు విమర్శలు

14-04-2021 Wed 12:56
  • తిరుప‌తి లోక్‌స‌భ‌ ఉప ఎన్నిక నేప‌థ్యంలో విమ‌ర్శ‌లు
  • ఎన్నికలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారు
  • బీజేపీ-జనసేనల‌ను చూస్తే వైసీపీ భయపడుతోంది 
  • వైసీపీ నేతలకు నిద్రపట్టట్లేదన్న వీర్రాజు 
somu veerraju slams jagan

తిరుప‌తి లోక్‌స‌భ‌ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఆయ‌న‌ అన్నింటిలోనూ అసమర్థుడని అన్నారు. ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా వాలంటీర్లను ఉప‌యోగించుకుని కుట్ర‌లు పన్ను‌తున్నార‌ని సోము వీర్రాజు ఆరోపించారు.

జ‌న‌సేన అధినేత‌ పవన్‌ కల్యాణ్‌ను రాజకీయంగా వైసీపీ నేత‌లు ఎదుర్కోలేకపోతున్నారని ఆయ‌న చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీజేపీ-జనసేనల‌ను చూస్తే వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఆయ‌న చెప్పారు. త‌మ‌కు ప్ర‌జ‌ల నుంచి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకు నిద్రపట్టట్లేదని చెప్పుకొచ్చారు.