Mamata Banerjee: మోదీ అబద్ధాలు చెబుతున్నట్టు తేలితే, గుంజీలు తీయాల్సిందే: మమతా బెనర్జీ

  • ముగిసిన మమతా బెనర్జీ 24 గంటల దీక్ష
  • మోదీ వ్యాఖ్యలు ఈసీకి కనిపించట్లేదా?
  • నేను తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • మోదీ తప్పుందని తేలితే గుంజీలు తీస్తే చాలన్న మమత
Mamata Demands Sit Ups from Modi

గడచిన 24 గంటలుగా నిరసన దీక్షకు దిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తన దీక్షను విరమించే వేళ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. "మోదీ అబద్ధాల కోరు... ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అబద్ధాల కోరు అన్న మాట అన్ పార్లమెంటరీ పదం అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నేను అంటాను. ఆయన చాలెంజ్ ని నేను అంగీకరిస్తున్నారు. నేనేదైనా తప్పు చేసుంటే, రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసినట్టు రుజువైతే, రెండు చేతులతో చెవులను పట్టుకుని, మోకాళ్లపై వంగుతూ గుంజీలు తీస్తే చాలు" అని వ్యాఖ్యానించారు.

కోల్ కతాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాసత్ ప్రాంతంలో దీక్ష చేపట్టిన ఆమె, అక్కడికి చేరుకున్న తన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న తేదీల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ప్రచారం చేస్తున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా ఎనిమిది దశల్లో పోలింగ్ ను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రకటించిందని మండిపడ్డారు. కేవలం నాలుగు దశలు మాత్రమే సరిపోయేదని అభిప్రాయపడ్డారు.

"పోలింగ్ జరిగే రోజున ప్రధాని పర్యటనలను ఈసీ ఎందుకు నిషేధించడం లేదు? పోలింగ్ తేదీలు ఉన్న రోజుల్లో నా ప్రచారాన్ని నిలిపివేసేందుకు నేను సిద్ధమే. నరేంద్ర మోదీ సిద్ధమా?" అని ప్రశ్నించారు. పోలింగ్ తేదీల్లో ప్రచారం వద్దన్నది తమ పార్టీ దీర్ఘకాల డిమాండని ఆమె తెలిపారు.

కాగా, రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ లో పోలింగ్ జరుగుతుండగా, మరో ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ప్రధాని, సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఇప్పటికే ఓడిపోయారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈసీ నిబంధనల మేరకు మోదీ, మోరల్ కోడ్ ను ఉల్లంఘించినట్టేనని అప్పట్లోనే మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా, శనివారం నాడు పశ్చిమ బెంగాల్ లో తదుపరి దశ పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News