Telangana: ‘సాగర్’లో పోటాపోటీగా మటన్, చికెన్, మద్యం పంపకాలు.. ఓటర్లను మచ్చిక చేసుకునే యత్నం

  • రేపటితో ప్రచారానికి తెర
  • ఓ పార్టీ కిలో మటన్, మద్యం సీసాల పంపిణీ
  • మరో పార్టీ కిలో చికెన్ పంపిణీ
  • పండుగ ఖర్చులకు రూ. 500
Parties serve mutton chicken and liquor bottles in Nalgonda dist

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. మద్యం, ముక్క పంపిణీలో మునిగి తేలుతున్నాయి. నిన్న ఉగాదిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని గజలాపురం, కొణతాలపల్లి, కన్నెకల్, గారుకుంటపాలెం తదితర ప్రాంతాల్లో ఓ పార్టీ ఇంటింటికీ కిలో మటన్, మద్యం సీసాను పంపిణీ చేసింది.

విషయం తెలిసి వెంటనే అప్రమత్తమైన మరో ప్రధాన పార్టీ కిలో చికెన్‌ను పంపిణీ చేసి తామూ ఏమీ తక్కువ కాదని నిరూపించుకుంది. అంతేకాదు, నిడమనూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఓ ప్రధాన పార్టీ పండుగ ఖర్చులకు ఉంచమని రూ. 500 చొప్పున పంపిణీ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇక, పండుగ రోజున నిజంగా తమ కుటుంబాల్లో పండుగ తీసుకొచ్చారంటూ ఆయా గ్రామాల ప్రజలు సంబరపడ్డారు. పైసా ఖర్చు లేకుండానే ఉగాది పండుగ సంతోషంగా జరుపుకున్నట్టు పలు గ్రామాల ప్రజలు చెప్పుకుంటున్నారు.

కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేపటితో తెరపడనుంది.  అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని టీఆర్ఎస్, ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, బీజేపీ కూడా విజయంపై కన్నేసింది.

More Telugu News