అతీత శక్తులు వస్తాయని కన్నబిడ్డలను కడతేర్చేందుకు యత్నం

14-04-2021 Wed 09:05
  • స్నేహితురాలితో భార్యకు ఇంట్లోనే వివాహం జరిపించిన భర్త
  • చిన్నారులకు చిత్ర హింసలు
  • శరీరానికి కారంపూసి ఎండలో పడుకోబెట్టిన వైనం
  • ఇంట్లోంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న చిన్నారులు
Parents Attempt to seduce children for supernatural powers

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢ విశ్వాసంతో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులు హతమార్చడం ఇటీవల సంచలనమైంది. తాజాగా తమిళనాడులోనూ దాదాపు అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. అయితే, ఇక్కడ చిన్నారులు ఇద్దరూ చాకచక్యంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రైల్‌నగర్‌కు చెందిన రామలింగం (42), రంజిత (32) భార్యాభర్తలు. వీరికి దీపక్ (15), కిషాంత్(6) సంతానం.

చీరల వ్యాపారం చేసే రామలింగం ఇందుమతిని రెండో వివాహం చేసుకుని అదే ప్రాంతంలోని వేరే ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలైన ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరింటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రంజితతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి స్నేహాన్ని గమనించిన రామలింగం మీరిద్దరూ శివపార్వతుల్లా ఉన్నారని చెప్పాడు. దీంతో వారిలో కొత్త ఆలోచనలు చెలరేగాయి. ఇటీవల తామిద్దం పెళ్లి చేసుకుంటామని ధనలక్ష్మి, రంజిత చెప్పడంతో రామలింగం అందుకు అంగీకరించాడు.

అంతేకాదు, కుమారుల ఎదుట ఇంట్లోనే వారిద్దరికీ వివాహం చేశాడు. వారి పెళ్లి తర్వాత పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. స్కూలుకు పంపకుండా వారితో ఇంటి పనులు చేయించడం మొదలుపెట్టారు. అతీతశక్తులు వస్తాయన్న నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేసేవారు. అక్కడితో ఆగక శరీరానికి కారం పూసి ఎండలో పడుకోబెట్టేవారు. వారితో శానిటైజర్ తాగించేవారు.

చివరికి వారిని బలి ఇవ్వడం ద్వారా అతీత శక్తులను సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశారు. వారి మాటల ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారులు ఇంటి నుంచి పారిపోయి తాతయ్య ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత, ధనలక్ష్మి, రామలింగాన్ని అదుపులోకి తీసుకున్నారు.