రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి స్టోక్స్ అవుట్

14-04-2021 Wed 07:14
  • వేలి గాయంతో ఐపీఎల్ మొత్తానికి దూరం
  • ఇప్పటికే జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్
  • ఇక్కడే ఉండి సలహాలు ఇస్తాడన్న జట్టు యాజమాన్యం
Ben Stokes ruled out of IPL 2021

ఐపీఎల్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ ఇప్పటికే జట్టుకు దూరం కాగా, ఇప్పుడు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది.

అయితే, ఆ తర్వాత ఫీల్డింగ్, బౌలింగ్ కూడా చేశాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ తొలి ఓవర్‌లోనే అవుటై పెవిలియన్ చేరాడు. నిన్న అతడి వేలికి స్కానింగ్ చేయగా అది విరిగినట్టు తేలింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. మ్యాచ్‌లు ఆడకపోయినా ఇక్కడే ఉంటాడని, ఆటగాళ్లకు సలహాలు ఇస్తాడని పేర్కొంది.