కొవిడ్ ఎఫెక్ట్: వైజాగ్ రైల్వే స్టేషన్‌లో మరిన్ని ఆంక్షలు

14-04-2021 Wed 06:48
  • ఏపీలో ప్రతి రోజు వేల సంఖ్యలో వెలుగు చూస్తున్న కేసులు
  • స్టేషన్‌లోకి వచ్చిపోయే వారికి రెండు వేర్వేరు మార్గాలు
  • ఎవరికి వారే ఆహారం తెచ్చుకోవాలని సూచన
Some Other Restrictions in Visakha Railway Station

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్‌లో మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు స్టేషన్‌లోకి వచ్చిపోయే ప్రయాణికులను ఒకే దారి నుంచి అనుమతిస్తుండగా, ఇక నుంచి రెండు వేర్వేరు మార్గాల ద్వారా అనుమతించనున్నారు.

స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులను జ్ఞానాపురం గేట్ వద్దనున్న 8వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి స్టేషన్‌లోకి అనుమతిస్తామని, బయటకు వెళ్లేవారు ఒకటో నంబరు ప్లాట్ ఫాం నుంచి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు తొలుత థర్మల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు.

ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు సరఫరా చేయబోమని, ఎవరికి వారే వాటిని తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, స్టేషన్‌లో ఎవరూ గుంపులుగా ఉండొద్దని, ఆహారం కూడా ఎవరికివారే తెచ్చుకోవాలని కోరారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరచూ శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.