అలాంటి వ్యాఖ్యలు చేయకండి... సువేందు అధికారికి ఎన్నికల సంఘం వార్నింగ్‌

13-04-2021 Tue 20:59
  • మమతపై పోటీకి దిగిన సువేందు
  • నందిగ్రామ్‌లో మినీ పాకిస్థాన్ అంటూ వ్యాఖ్యలు
  • తీవ్రంగా పరిగణించిన ఈసీ
  • ఎన్నికల కోడ్‌లోని కొన్ని నిబంధనల ఉల్లంఘనలా వున్నాయి  
Election commission warns Suvendhu adhikari over derogatory comments

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీపై పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో రెచ్చగొట్టే, ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేసే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రచారంలో భాగంగా ఇటీవల నందిగ్రామ్‌లో మినీ పాకిస్థాన్‌ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈసీ ఆయనను హెచ్చరించింది. మరోవైపు మమతా బెనర్జీ తన ప్రచారంపై విధించిన 24 గంటల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సువేందును ఈసీ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘మీరు బేగం(మమత)కు ఓటేస్తే మినీ పాకిస్థాన్‌ తయారవుతుంది. మీ ప్రాంతంలోకి ఓ దావూద్‌ ఇబ్రహీం వచ్చాడు’’ అని ఇటీవల నందిగ్రామ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సువేందు అన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. సువేందు మాటలు ఎన్నికల కోడ్‌లోని కొన్ని నిబంధనల్ని ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.