జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు తనపై తానే రాళ్ల దాడి చేసుకున్నారు: భూమన

13-04-2021 Tue 20:54
  • తిరుపతిలో నిన్న చంద్రబాబు ప్రచారం
  • రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు
  • అంతా డ్రామా అంటున్న వైసీపీ నేతలు
  • చంద్రబాబువి నీచ రాజకీయాలన్న భూమన
Bhumana comments on Chandrababu

తిరుపతిలో తనపై రాళ్ల దాడి జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు తారస్థాయికి చేరాయని విమర్శించారు. జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు తనపై తానే రాళ్ల దాడి చేసుకున్నారని ఆరోపించారు. రాయి విసిరితే తలకు గాయం కావాలి కానీ కాలికి ఎలా గాయమైందని భూమన ప్రశ్నించారు.

గతంలో మావోయిస్టుల దాడి జరిగినప్పుడు రెండ్రోజులు ఎడమచేతికి కట్టు కట్టుకున్నారని, మరో రెండ్రోజులు కుడి చేతికి కట్టు కట్టుకుని అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు తిరుపతి ప్రజలు ఎదురుచూస్తున్నారని భూమన వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి భారీ మెజారిటీ ఖాయమని అన్నారు.