ఐసోలేషన్‌లోకి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

13-04-2021 Tue 20:26
  • ఆయన కార్యాలయంలో కొంతమందికి కరోనా
  • వారిలో కొంతమందికి సీఎంతో కాంటాక్ట్‌
  • ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లోకి
  • ఈ నెల ఆరంభంలో తొలి డోసు టీకా తీసుకున్న సీఎం
Yogi adityanath is in isolation

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆయన కార్యాలయంలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

‘‘నా కార్యాలయంలో పనిచేసే కొంతమంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో కొంతమంది నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. అందుకే ముందు జాగ్రత్తగా నాకు నేనుగా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాను. వర్చువల్‌గా పనిచేయడం ప్రారంభించాను’’ అని ఆదిత్యనాథ్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం 18,021 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 85 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 95,980 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 80 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందజేశారు. యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఈ నెల ఆరంభంలో తొలి డోసు టీకా తీసుకున్నారు.