Corona Virus: సమస్య టీకాల కొరత కాదు.. సరైన ప్రణాళిక లేకపోవడమే: కేంద్ర ఆరోగ్య శాఖ

  • టీకాల కొరత ఉందంటూ పలు రాష్ట్రాల ఆరోపణ
  • కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
  • రాష్ట్రాల వద్ద 1.67 కోట్ల డోసులున్నాయని వెల్లడి
  • వ్యర్థాలను తగ్గించాలని విజ్ఞప్తి
  • ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్‌ అవసరమైనవారికే రెమిడెసివిర్‌
issue is about better planning not the shortage of doses Union Health Secretary

రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.67 కోట్ల కరోనా టీకా డోసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 13,10,90,370 డోసులు అందజేశామని తెలిపారు. వీటిలో వ్యర్థాలతో కలుపుకొని 11,43,69,677 డోసులు వినియోగించారన్నారు. ఇంకా 1,67,20,693 డోసులు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఆరోపిస్తున్నట్లుగా సమస్య టీకాల కొరత కాదని.. సరైన ప్రణాళిక లేకపోవడమేనని ఆరోపించారు.

ఇక ఇప్పటి వరకు వినియోగించని టీకాలను సరైన విధంగా ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. ఉదాహరణకు ఏదైనా రాష్ట్రంలో రోజువారీ వ్యాక్సినేషన్‌ వేగాన్ని బట్టి ఎక్కువ డోసులు అవసరమవుతున్న జిల్లాలకు తక్కువ డోసులు అందిస్తున్న జిల్లాల నుంచి సర్దుబాటు చేయాలని హితవు పలికారు. టీకా వ్యర్థాలను కూడా తగ్గించాలని కోరారు. కేరళలో సున్నా శాతం వ్యర్థాలు నమోదుకాగా.. కొన్ని రాష్ట్రాల్లో 8-9 శాతం టీకా డోసులు వ్యర్థం అవుతున్నాయని తెలిపారు.  

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోందని గుర్తుచేశారు. మరణాలు సైతం పెరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాల్లో మహమ్మారి పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఇక రెమిడెసివిర్‌ ఔషధాన్ని కరోనా సోకి ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు మాత్రమే ఇవ్వాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. ఎలాంటి లక్షణాలు లేకుండా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు దీన్ని వినియోగించవద్దని తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో దీని కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

More Telugu News