టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మా విచారణలో కనిపించలేదు: రాళ్ల దాడిపై డీఐజీ వివరణ

13-04-2021 Tue 17:58
  • తిరుపతిలో నిన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • కలకలం రేపిన రాళ్ల దాడి ఘటన
  • ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • స్పందించిన డీఐజీ కాంతిరాణా
  • ఆధారాల్లేవని వెల్లడి
  • చంద్రబాబుకు నోటీసులిచ్చామని వ్యాఖ్యలు
DIG Kantirana responds to TDP complaint on stone pelting issue

తిరుపతిలో తాము రోడ్ షో నిర్వహిస్తుంటే రాళ్ల దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడం తెలిసిందే. దీనిపై ఆయన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు సైతం ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై డీఐజీ కాంతిరాణా స్పందించారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన పరిస్థితులు తమ విచారణలో కనిపించలేదని అన్నారు. తమకు రాళ్లు తగిలాయని ఇద్దరు కార్యకర్తలు చెప్పారని, సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశామని చెప్పారు. ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించడంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజి కూడా పరిశీలించామని డీఐజీ వెల్లడించారు.

అయితే దాడి ఘటనపై తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఎన్ఎస్ జీ కమాండోలను కూడా ప్రశ్నించామని, చంద్రబాబు కాన్వాయ్ ని పరిశీలించామని కాంతిరాణా వివరించారు. ఈ క్రమంలో ఘటనపై ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని, ఇదే అంశంలో ఆధారాలుంటే ఇవ్వాలని ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలను కూడా కోరామని వెల్లడించారు.