ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఇష్క్' రిలీజ్ డేట్ ఖరారు!

13-04-2021 Tue 17:41
  • హీరోగా తేజ సజ్జ మరో సినిమా
  • కథానాయికగా ప్రియా ప్రకాశ్ వారియర్
  • ఈ నెల 23వ తేదీన విడుదల
Ishq movie release date announced

ప్రియాప్రకాశ్ వారియర్ పేరు వినగానే, 'ఒరు ఆదార్ లవ్' సినిమాలో ఆమె కన్నుగీటి పిస్తోల్ తో పేల్చినట్టుగా సైగ చేయడమే గుర్తుకు వస్తుంది .. గుండె ఝల్లుమంటుంది. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరిని తేనెటీగల్లా తనచుట్టూ తిప్పుకుంది. అలా కైపు కళ్లతో .. మత్తు చూపులతో మతులు పోగొట్టిన ఈ పిల్ల, ఇటీవల 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ జోడీగా ఈ అమ్మాయి చెలరేగిపోతుందేమోనని అనుకుంటే, నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించి ఉసూరుమనిపించింది. ఈ పిల్ల ఇలా చేసిందేంట్రా బాబూ అనుకుంటూ పరేషాన్ కాని పిల్లగాళ్లు లేరు.

తాజాగా ఈ అమ్మాయి నుంచి మరో సినిమా వస్తోంది .. దాని పేరే 'ఇష్క్' .. 'నాట్ ఎ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్. ఎన్వీ ప్రసాద్ .. పారస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించాడు. 'జాంబి రెడ్డి' సినిమాతో పాప్యులర్ అయిన తేజ సజ్జ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆయన జోడీగా ప్రియా ప్రకాశ్ అలరించనుంది.

ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ .. ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది లవ్ స్టోరీ కాదంటూ దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో చూడాలి మరి.