'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

13-04-2021 Tue 17:04
  • రానా ప్రధాన పాత్రధారిగా 'విరాటపర్వం'
  • గ్రామీణ యువతి పాత్రలో సాయిపల్లవి
  • ముఖ్యమైన పాత్రల్లో ప్రియమణి .. నివేదా పేతురాజ్    

Special Look From Virataparvam Movie

విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ సాయిపల్లవి దూసుకుపోతోంది. ఒక పాత్రకు పూర్తి భిన్నమైన మరొక పాత్రను చేస్తూ, సాయిపల్లవి ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది. ఇటు యూత్ తో పాటుగా అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆమెను ఓన్ చేసుకుంటూ ఉండటం విశేషం. సున్నితమైన భావాలను బలంగా పలికించే కథానాయికగా ఆమెకి మంచి క్రేజ్ ఉంది. అలాంటి సాయిపల్లవి 'లవ్ స్టోరీ'తో పాటు, 'విరాటపర్వం' సినిమాను కూడా పూర్తిచేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన 'విరాటపర్వం'లో .. రానా ప్రధానమైన పాత్రను పోషించగా, ఆయన సరసన అలరించే పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా 'ఉగాది' పండుగ కానుకగా ఈ సినిమా నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్ ను వదిలారు. గ్రామీణ నేపథ్యంలోని పాతకాలంనాటి ఇల్లు .. ఆ కాలం నాటి గుమ్మానికి సాయిపల్లవి మామిడితోరణాలు కట్టింది. లంగా .. వోణి ధరించి, సంతోషంతో గడపకు పసుపు రాసి కుంకుమబొట్లు పెడుతోంది. 'ఉగాది' సందర్భంగా వదిలిన ఈ లుక్ ఎంతో నేచురల్ గా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రియమణి .. నివేద పేతురాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.