Ponguleti Sudhakar Reddy: మోదీ, అమిత్ షా మీద మాట్లాడతావా? బెదిరిస్తున్నావా?: కేటీఆర్ పై పొంగులేటి ఫైర్

  • విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాడుతున్నారు
  • కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • పక్క రాష్ట్రం నీళ్ల దోపిడీ చేస్తుంటే పట్టించుకోవడం లేదు
Ponguleti Sudhakar Reddy fires on KTR

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అహంకారం నెత్తికెక్కిందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న వారిపై ఏం మాట్లాడుతున్నావంటూ మండిపడ్డారు. బెదిరిస్తున్నావా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంటే టీఆర్ఎస్ పార్టీకి కాదని... రాష్ట్ర ప్రజలకు అనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందా? అని అడిగారు.

మోదీ, అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెనక్కి తీసుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. పక్కనున్న ఏపీ రాష్ట్రం నీళ్ల దోపిడీ చేస్తుంటే పట్టించుకోని కేటీఆర్ కు... ఇప్పుడు పునర్విభజన చట్టం గుర్తుకొచ్చిందా? అని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... కేంద్రంపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు.

More Telugu News