ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా లోకేశ్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు: సీఎం జగన్ పై అచ్చెన్న ఆగ్రహం

13-04-2021 Tue 15:08
  • తిరుపతి ఉప ఎన్నికలో మాటల తూటాలు
  • టీడీపీలో విభేదాలు సృష్టించలేవన్న అచ్చెన్న  
  • లోకేశ్ సవాల్ కు తోక ముడిచావంటూ ఎద్దేవా
Atchannaidu fires in CM Jagan

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ పై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. "నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు తీసుకొచ్చినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు" అంటూ మండిపడ్డారు. 'చంద్రబాబు నాయకత్వంతో తిరుపతి ఉప ఎన్నిక‌కు టీడీపీ నాయకులు ఐకమత్యంతో పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది' అని వ్యాఖ్యానించారు.

"నారా లోకేశ్ విసిరిన సవాల్ కు తోకముడిచావు. నిన్న తిరుపతిలో చంద్రబాబు సభపై రాళ్లు వేయించావు. ఇవాళ నా సంభాషణల్ని వక్రీకరించావు. నువ్వెన్ని విషపన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేవు... నారా లోకేశ్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు" అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.