చంద్రబాబు నీచ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి: గోరంట్ల మాధవ్

13-04-2021 Tue 14:45
  • నిన్న తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • రాళ్ల దాడి జరిగిందంటూ చంద్రబాబు ఆరోపణలు
  • ఆరోపణలను తిప్పికొడుతున్న వైసీపీ నేతలు
  • ప్రజల్లో సానుభూతి కోసమే నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం
  • తిరుపతిలో వైసీపీ గాలి బలంగా వీస్తోందన్న గోరంట్ల మాధవ్
Gornatla Madhav slams Chandrababu allegations

తిరుపతిలో తనపై రాళ్ల దాడి జరిగిందని, అందుకు వైసీపీ నేతలే కారకులని టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు పతాకస్థాయికి చేరుకున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.

ప్రజల్లో సానుభూతి కోసమే రాళ్ల దాడి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాళ్ల దాడి డ్రామా అని తేలితే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలో వైసీపీ గాలి బలంగా వీస్తోందని, విపక్షాలకు ఉనికి లేకుండా చేసేందుకు తిరుపతి ప్రజలు సిద్ధమయ్యారని గోరంట్ల మాధవ్ అన్నారు.

నిన్న తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా రాళ్ల దాడి కలకలం రేగింది. తమపై రాళ్ల దాడి జరిగిందంటూ చంద్రబాబు వాహనం దిగి రోడ్డుపైనే బైఠాయించడం, ఆపై ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.