హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. బలమైన ఆధారాలు వున్నాయి: టీటీడీ ఈవో ప్రకటన

13-04-2021 Tue 13:31
  • పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీ 
  • ఆధారాలు సేక‌రించిన‌ పండితుల కమిటీ 
  • శ్రీవారు కొలువై ఉన్న‌ తిరుమలే ఆంజ‌నేయుడి జన్మస్థలం
  • త్వరలో ఆధారాలు బయటపెడతామన్న ఈవో   
ttd anounces birth place of hamuma

హనుమంతుడి జన్మస్థలం విష‌యంపై ఉగాది సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీవారు కొలువై ఉన్న‌ తిరుమలే ఆంజ‌నేయుడి జన్మస్థలమని టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హ‌నుమ‌ జన్మస్థలంపై పండితులు ఆధారాలు సేకరించారని, త‌మ‌ వద్ద ఉన్న‌ ఆ బలమైన ఆధారాలను త్వరలో బయటపెడతామ‌ని చెప్పారు.

ఆధారాలతో నివేదిక తయారు చేశామ‌ని, దాన్ని త్వ‌ర‌లోనే ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తామ‌ని తెలిపారు. ఆంజ‌నేయుడి జన్మస్థలం తమ రాష్ట్రంలోనే ఉంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రమూ ప్రకటించలేదని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ ఇతర రాష్ట్రాల వ‌ద్ద అటువంటి ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చ‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై  క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. తిరుమల సప్తగిరుల్లో ఒకటైన అంజనాద్రిలోనే ఆంజనేయుడు జన్మించాడన్న విషయంపై నిర్ధారణకు గ‌త ఏడాది డిసెంబరులో పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పరిశోధన సాగించిన క‌మిటీ నివేదిక‌ను స‌మ‌ర్పించింది.