రవితేజ దూకుడు .. కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు!

13-04-2021 Tue 12:17
  • మరో కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్
  • కథానాయికగా  'దివ్యాన్ష కౌశిక్'
  • ఈ నెల నుంచే రెగ్యులర్ షూటింగ్  
Mass Maharaja RaviTeja New Movie Pooja done today

మొదటి నుంచి కూడా రవితేజ చాలా వేగంగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. జయాపజయాల సంగతి అటుంచితే, ఆడియన్స్ కి, తనకి మధ్య గ్యాప్ లేకుండా .. రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇక కంటెంట్ నచ్చితే కొత్త దర్శకులతో చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనకాడడు. ఆయన అవకాశం ఇచ్చిన దర్శకులు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా మెగాఫోన్ తిప్పేస్తున్నారు. అలా రవితేజ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు .. ఆ దర్శకుడి పేరే శరత్ మండవ. రచయితగా మంచి అనుభవమున్న శరత్ కి దర్శకుడిగా ఇది తొలి సినిమా.


'ఉగాది' పండుగను పురస్కరించుకుని, ఈ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కరోనా తీవ్రత కారణంగా చాలా సింపుల్ గా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడి చిత్రపటాలపై రవితేజ క్లాప్ ఇవ్వగా, ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించారు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. నాగచైతన్య జోడీగా 'మజిలీ' సినిమాతో పరిచయమైన 'దివ్యాన్ష కౌశిక్' ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలుకానుంది.