కొవిడ్ ఎఫెక్ట్: రెండు గంటల్లోపు విమాన ప్రయాణంలో భోజనం బంద్

13-04-2021 Tue 07:23
  • ఆదేశాలు జారీ చేసిన పౌర విమానయాన శాఖ
  • పలు మార్గదర్శకాలు జారీ
  • అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తుందన్న కేంద్రం
No meals on domestic flights below 2 hour duration
దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల్లో రెండు గంటల ప్రయాణాలకు భోజనాన్ని సరఫరా చేయకూడదని నిర్ణయించింది. నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇది అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తుందని తెలిపింది.

 కేంద్రం తాజా ఆదేశాల ప్రకారం.. బిజినెస్, ఎకానమీ క్లాసుల్లో ట్రేలు, ప్లేట్లు, కట్లరీ తప్పనిసరిగా డిస్పోజబుల్ అయి ఉండాలి. రొటేటబుల్స్‌ను పునర్వినియోగానికి ముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలి.

టీ, కాఫీ, ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ పానీయాలను డిస్పోజబుల్ క్యాన్లు, కంటైనర్లు, బాటిళ్లు, గ్లాసుల్లో మాత్రమే సరఫరా చేయాలి. వినియోగించిన అనంతరం విమాన సిబ్బంది వాటిని డిస్పోజ్ చేయాలి. వీటిని సరఫరా చేసే ప్రతిసారి సిబ్బంది కొత్త గ్లౌజులు ధరించాలి.

కాగా, గతేడాది లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలపాటు నిలిచిపోయిన విమాన సర్వీసులు అదే ఏడాది మే 25న తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు.