Karnataka: డ్రగ్స్ కేసులో మరింతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు... ఉచ్చు బిగుస్తున్న కర్ణాటక పోలీసులు!

More MLAs of Telangana Involved in Karnataka Drugs Case
  • రోజుకో మలుపు తిరుగుతున్న కేసు
  • రెండు రోజుల్లో ప్రధాన నిందితుల స్టేట్ మెంట్ రికార్డు
  • ఆచితూచి వ్యవహరిస్తున్న కర్ణాటక పోలీసులు
కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా, ఈ కేసులో మరింత మంది తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు బయటకు రావచ్చని తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి కలహర్ రెడ్డి, తనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని పోలీసులకు వెల్లడించేందుకు అంగీకరించడంతో, ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు గోవిందపుర పోలీసుల కస్టడీలో ఉన్న కలహర్ రెడ్డితో పాటు, కేసులో మరో నిందితుడైన ట్రావెల్స్ యజమాని రతన్ రెడ్డి సైతం  వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

మరో రెండు రోజుల్లో వీరి స్టేట్ మెంట్ ను రికార్డు చేసి, ఆపై ఎమ్మెల్యేలను విచారించాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించారు. కేసులో ప్రధాన పాత్రధారి అయిన కన్నడ నిర్మాత శంకర్ గౌడ, ఏర్పాటు చేసే పార్టీలకు పలువురు నేతలు హాజరవుతుండేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసులో ముందడుగు వేసే ముందు మరిన్ని సాంకేతిక ఆధారాలు సంపాదించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ కేసు ఫిబ్రవరి 26న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోని వారికి డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియా వ్యక్తుల అరెస్ట్ తో డొంక కదిలింది. ఆపై శంకర్ గౌడతో పాటు మరింత మంది వ్యాపారులు, ప్రజా ప్రతినిధుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదే కేసులో సందీప్ రెడ్డితో పాటు ఇప్పటికే ఓ చిన్న హీరోను కూడా పోలీసు అధికారులు ప్రశ్నించారు.

ముగ్గురు శాసనసభ్యుల పేర్లు ఇప్పటికే పోలీసుల రికార్డుల్లోకి ఎక్కగా, పూర్తి విచారణ జరిగితే మరింత మంది పేర్లు బయటకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే తనతో పాటు మరింత మందిని తీసుకుని వస్తుంటారని, వారు ఎవరన్న విషయాన్ని అతను మాత్రమే చెప్పగలరని భావిస్తున్నామని అన్నారు. అందుకే ఈ కేసు ముందడుగు వేసేందుకు సదరు ఎమ్మెల్యే కీలకమని భావిస్తున్నారు.

కాగా, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయన్న సమాచారమే తప్ప, వారు ఎవరన్నదీ ఇంతవరకూ బయటకు రాలేదు. ఒకసారి కర్ణాటక పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి, ఆపై నోటీసులు పంపితే వారి పేర్లు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే, పక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు కేసులో ఉండటంతో కర్ణాటక పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దర్యాఫ్తు విషయంలో తాము ఎంతమాత్రమూ తొందరపడటం లేదని బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ శరణప్ప వ్యాఖ్యానించారు. తమకు అనుమానం ఉన్న వారి సెల్ ఫోన్ లొకేషన్లు సేకరిస్తున్నామని, నేడో, రేపో అవి లభిస్తాయని ఆయన అన్నారు.
Karnataka
Drugs
Telangana
MLAs

More Telugu News