Uttar Pradesh: బాబ్రీ కేసులో తీర్పిచ్చిన మాజీ న్యాయమూర్తిని డిప్యూటీ లోకాయుక్తగా నియమించిన యూపీ ప్రభుత్వం

  • ఏళ్ల తరబడి సాగిన బాబ్రీ విధ్వంసం కేసు
  • గత సంవత్సరం తీర్పిచ్చిన సురేంద్ర కుమార్ యాదవ్
  • తాజాగా యూపీ లోకాయుక్తగా నియామకం
UP Appointed Surendra Kumar as Lokayukta

దేశవ్యాప్తంగా ఏళ్ల పాటు చర్చనీయాంశమై, ఇండియాలోని అత్యంత హై ప్రొఫైల్ కేసుల్లో ఒకటిగా నిలిచిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో గత సంవత్సరం కీలక తీర్పిచ్చి, ఆపై పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ ను డిప్యూటీ లోకాయుక్తగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

గత సంవత్సరం సెప్టెంబర్ 30న స్పెషల్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పిస్తూ, ఎల్కే అద్వానీ, ఉమా భారతి, కల్యాణ్ సింగ్ సహా మొత్తం 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992 సంవత్సరం డిసెంబర్ 6న కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

"సురేంద్ర కుమార్ యాదవ్ ను యూపీ డిప్యూటీ లోకాయుక్తగా గవర్నర్ నియమించారు. లోకాయుక్త సంజయ్ మిశ్రా ఆయనతో ఉన్నతాధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు" అని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. సమాజంలో జరుగుతున్న అవినీతిపై నిఘా వేసేందుకు ఏర్పాటు చేసిన లోకాయుక్తలో ముగ్గురు సభ్యులు ఉన్నారు.

తాజా ప్రమాణ స్వీకారం తరువాత యూపీ లోకాయుక్తలో సురేంద్ర కుమార్ తో పాటు శంభు సింగ్ యాదవ్, దినేశ్ కుమార్ సింగ్ లు విధులు నిర్వహించనున్నారు. లోకాయుక్త సభ్యునిగా సురేంద్ర నియామకం ఎనిమిది సంవత్సరాలు కొనసాగనుంది.

More Telugu News