Chandrababu: రాళ్ల దాడిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం నిరసన విరమించిన చంద్రబాబు

  • తిరుపతిలో ఉద్రిక్తతలు
  • టీడీపీ ప్రచారం సందర్భంగా రాళ్ల దాడి
  • రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు
  • ఆపై ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన వైనం
Chandrababu complains SP on stone pelting incident

తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రోడ్ షోలో ప్రసంగిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆపై ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తన రోడ్ షోలో జరిగిన రాళ్ల దాడిని చంద్రబాబు ఎస్పీకి వివరించారు. ఎస్పీకి ఫిర్యాదు అనంతరం చంద్రబాబు నిరసన విరమించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని ఆరోపించారు. టీడీపీ నేతలపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారని వెల్లడించారు. టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ దుష్ట పన్నాగాలకు పాల్పడుతోందని అన్నారు. రాళ్ల దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

 టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరిస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిష్పాక్షికంగా వ్యవహరించాలని, పోలీసులు సీఈసీ పరిధిలో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలని కోరారు.

More Telugu News