కేరళలో మరో మూడు రోజుల్లో నిండుకోనున్న కరోనా టీకా నిల్వలు: సీఎం విజయన్‌

12-04-2021 Mon 22:24
  • గతంలో రాష్ట్రానికి 56 లక్షల డోసుల కేటాయింపు
  • 48 లక్షల డోసులు ప్రజలకు అందజేత
  • మరో 50 లక్షల డోసులను కోరిన విజయన్‌
  • కేంద్రానికి లేఖ రాసిన సీఎం
Kerala Chief Minister Writes To Centre for Additional 50lakh vaccine doses

కేరళలో మరో మూడు రోజుల్లో కరోనా టీకా డోసుల నిల్వలు నిండుకోనున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే 50 లక్షల డోసులు రాష్ట్రానికి కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా విజయన్‌ గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న నిల్వలతో మరో మూడు రోజులు మాత్రమే టీకా వేయగలమని విజయన్‌ తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కానీ ఇంకా టీకాలు అందలేదని తెలిపారు.

కేరళకు ఇప్పటి వరకు 56 లక్షల టీకా డోసులు అందాయని.. వీటిలో 54 లక్షలు కొవిషీల్డ్‌, రెండు లక్షలు కొవాగ్జిన్‌ డోసులని విజయన్‌ తెలిపారు. ఇప్పటి వరకు 48 లక్షల డోసులు ప్రజలకు అందజేసినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలంటే వీలైనంత త్వరగా 50 లక్షల డోసులు అందించాలని కోరారు. కేరళలో గత 24 గంటల్లో 5,692 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 11.72 లక్షలకు చేరింది.