నాని 'టక్ జగదీష్' విడుదల వాయిదా

12-04-2021 Mon 22:15
  • నాని, రీతూవర్మ జంటగా 'టక్ జగదీష్'
  • ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన సినిమా
  • పలు కారణాలతో వాయిదా
  • చిన్న బ్రేక్ అంటూ ప్రకటన చేసిన చిత్ర నిర్మాణ సంస్థ
  • వీడియోలో నాని సందేశం
Tuck Jagadish release postponed

నాని, రీతూవర్మ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'టక్ జగదీష్'. అయితే ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. 'ఒక చిన్న బ్రేక్! చాలా చిన్నది' అంటూ విడుదల వాయిదా నిర్ణయాన్ని వెలువరించింది. ఈ సందర్భంగా నాని వీడియోను కూడా పంచుకుంది.

ఈ సంవత్సరం క్రాక్ నుంచి వకీల్ సాబ్ వరకు విడుదలైన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయని నాని వెల్లడించారు. అన్ని వర్గాల వారికి నచ్చేలా తమ చిత్రం ఉంటుందని, అయితే తమ చిత్రం రిలీజ్ విషయంలో చిన్న బ్రేక్ తీసుకుంటున్నామని, చాలా చిన్న బ్రేక్ అని వివరించారు. తెలుగు ప్రేక్షకులను, సినిమాను విడదీయలేమని అన్నారు.

'టక్ జగదీష్' మాత్రమే కాదు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన 'లవ్ స్టోరీ' విడుదల కూడా ఇంతకుముందే వాయిదాపడింది! కరోనా కేసుల పెరుగుదలకు తోడు ఏపీలో నెలకొన్న పరిణామాలు కూడా చిత్రాల విడుదలను ప్రభావితం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తుండడం, టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలయ్యే పరిస్థితులు లేకపోవడంతోనే వాయిదా నిర్ణయం తీసుకుంటున్నట్టు భావిస్తున్నారు. 'టక్ జగదీష్' ఈ నెల 23న రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడా తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఎప్పుడు రిలీజయ్యేది త్వరలోనే వెల్లడించనున్నారు.