ఐ లవ్ పవన్ కల్యాణ్ గారు... ప్రకాశ్ రాజ్ తాజా వ్యాఖ్యలు

12-04-2021 Mon 21:25
  • గతంలో పవన్ పై విమర్శలు చేసిన ప్రకాశ్ రాజ్
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్న పవన్
  • పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్
  • తాజాగా పవన్ పై అభిమానం వ్యక్తం చేసిన వైనం
  • ఇద్దరివీ భిన్న రాజకీయ దృక్పథాలు అని వెల్లడి
Prakash Raj latest comments on Pawan Kalyan

జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ కొంతకాలంగా బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి విరమించుకుని, బీజేపీకి ఓటు వేయాలని పవన్ సూచించారు. పవన్ నిర్ణయం పట్ల అప్పట్లో నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఏర్పాటు చేసి మరో పార్టీకి ఓటు వేయాలని చెప్పడమే రాజకీయమా? అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేయాలని చెప్పే పవన్ కు రాజకీయాలు అవసరమా? అని నిలదీశారు.

దాంతో ప్రకాశ్ రాజ్ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్, ప్రకాశ్ రాజ్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటించారు. వీరిద్దరి మధ్య కోర్టు సీన్లు సినిమాలో హైలైట్ అయ్యాయి. ఇందులో ప్రకాశ్ రాజ్ నటనపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"మా ఇద్దరికీ వేర్వేరు రాజకీయ ధోరణులు ఉన్నాయి. అయితే, ఐ లవ్ పవన్ కల్యాణ్  గారు. ఆయన ఒక నాయకుడు...  ఆయన అలాగే ఉండాలని నేను ఆశించాను. ఆ విధంగా చూస్తే పవన్ కల్యాణ్ కూడా నా అభిప్రాయాలను గౌరవించారు. ఇది పరస్పర గౌరవం, ప్రగతిశీల దృక్పథాలకు సంబంధించిన విషయం" అని వివరించారు.