హర్యానాలో కరోనా ఉద్ధృతి.. రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

12-04-2021 Mon 19:51
  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
  • అత్యవసర సేవలకు మినహాయింపు
  • గర్భిణులు, ఆరోగ్య సమస్యలున్నవారికి అనుమతి
  • ఆదివారం 3,440 కేసులు, 16 మరణాలు
Night curfew in haryana

కరోనా విజృంభణ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడి కోసం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సమయంలో ఏ ఒక్కరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను తప్ప వేరేవాటిని రోడ్లపైకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

కరోనాపై పోరులో ముందున్న పోలీస్‌, మిలిటరీ, మీడియా, వైద్యారోగ్యం, విద్యుత్తు, అగ్నిమాపకం సహా ఇతర అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆసుపత్రులకు వెళ్లేందుకు అనుమతించింది. వీరుకాకుండా ఇంకెవరైనా బయటకు రావాలంటే కర్ఫ్యూ పాస్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో విజృంభిస్తున్న 16 రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి. ఆదివారం అక్కడ కొత్తగా 3,440 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా కేసుల సంఖ్య 3,16,881కి చేరింది. ఇక కొత్తగా 16 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 3,268కి చేరింది.