ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్... టాస్ గెలిచిన రాయల్స్

12-04-2021 Mon 19:24
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • ఇరు జట్లలోనూ హార్డ్ హిట్టర్లు
  • పంజాబ్ జట్టులో రాహుల్, గేల్
  • రాజస్థాన్ కు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ అండ
Rajastan vs Punjab Kings in Mumbai Wankhede stadium

ఐపీఎల్ లో నేడు ముంబయి వాంఖెడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. గత సీజన్ పరాభవాలను మరిపించేలా శుభారంభం అందుకోవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. పంజాబ్ జట్టు గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కాగా.... ఇప్పుడు పేరు మార్చుకుని పంజాబ్ కింగ్స్ అయింది. పేరు మార్పు కలిసొస్తుందేమో చూడాలి!

ఇక రాజస్థాన్, పంజాబ్ జట్లలో ప్రతిభావంతులకు కొదవలేదు. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, కెప్టెన్ సంజు శాంసన్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్ వంటి హార్డ్ హిట్టర్లున్నారు. ఇక, పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలాస్ పూరన్ మైదానంలో ఏ మూలకైనా బంతిని తరలించగల సత్తా ఉన్నవాళ్లే.

బౌలింగ్ చూస్తే... రాజస్థాన్ రాయల్స్ కు ముస్తాఫిజూర్ రెహ్మాన్, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్ వంటి బౌలర్లు అండగా ఉన్నారు. అయితే పంజాబ్ బౌలింగ్ విభాగమే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. మహ్మద్ షమీ, జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ లతో పాటు మురుగన్ అశ్విన్, అర్షదీప్ కూడా రాణిస్తే పంజాబ్ విజయావకాశాలు మెరుగవుతాయి.