తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉగాది శుభాకాంక్షలు

12-04-2021 Mon 18:54
  • ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థన
  • కొత్త ఏడాదిలో కష్టాలను దాటాలని ఆకాంక్ష
  • కరోనాను జయించాలని ప్రార్థన
  • మాస్క్‌లు ధరించాలని సూచన
Pawan wishes happy Ugadi to all the telugu people

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మనోవికాసం పరిమళిస్తూ.. మానవత్వం గుబాళించే సుసంపన్న సంప్రదాయాన్ని తరతరాలకు చేరవేస్తున్న పండుగగా ఉగాదిని అభివర్ణించారు. ప్లవ అంటే దాటించునది అని.. సంస్కృతి, సంప్రదాయాల కలయికతో వస్తున్న ఈ నూతన ప్లవ నామ సంవత్సరం ప్రజలను కష్టాలు, కరవుకాటకాల నుంచి సంపూర్ణంగా దాటించాలని ఆకాంక్షించారు.

కరోనా మహమ్మారిని ప్రజలందరూ క్షేమంగా దాటాలని కోరుకున్నారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థించారు. కరోనా విజృంభిస్తోందని గుర్తుచేసిన ఆయన ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హితవు పలికారు.