Deepika Padukone: ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్న దీపికా పదుకుణే!

  • 2019లో ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ బాధ్యతలను స్వీకరించిన దీపిక
  • బిజీ షెడ్యూల్ కారణంగా వైదొలగుతున్నానని వెల్లడి
  • ఈ సంస్థతో తన అనుబంధం కొనసాగుతుందని వ్యాఖ్య
Deepika Padukone Steps Down As MAMI Chairperson

ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ) సంస్థ ఛైర్ పర్సన్ పదవి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తప్పుకున్నారు. 35 ఏళ్ల దీపిక ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ పదవిలో కొనసాగడం తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆమె ఈ సందర్బంగా తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ టాలెంట్ ను ముంబైకి రప్పించడానికి ఈ పదవి ద్వారా తాను కృషి చేశానని... ఒక నటిగా ఇందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. అయితే, ప్రస్తుతం తనకున్న ఇతర పనుల కారణంగా... ఎంఏఎంఐకి తాను సమయాన్ని కేటాయించలేకపోతున్నానని దీపిక తెలిపారు. ఈ సంస్థతో తనకున్న అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని... మరో సమర్థవంతమైన వ్యక్తి ఈ సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

2019లో ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ బాధ్యతలను దీపిక చేపట్టారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ బాధ్యతలను స్వీకరించడం తనకు ఎంతో గర్వంగా ఉందని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ సంస్థే నిర్వహిస్తుంటుంది. అయితే కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన వేడుకలు రద్దయ్యాయి.

More Telugu News