ఉప్పెనలాంటి కన్నీరు .. 'మహాసముద్రం' ఫస్టులుక్!

12-04-2021 Mon 11:40
  • అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం'
  • ఎమోషన్స్ కి పెద్దపీట
  • ఆగస్టు 19వ తేదీన విడుదల  
Mahasamudram Adithi Rao First Look
'మహాసముద్రం' తీరం నుంచి చూస్తే ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో .. మధ్యలో నుంచి చూస్తే అంత భయంకరంగా అనిపిస్తుంది. గుండె బరువెక్కిన వాళ్లు తీరంలో కూర్చునే తమ ఆవేదనను సముద్రంతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సముద్రంలో ఏ కెరాటం ఎక్కడ పుడుతుందో .. ఏ కెరటం తీరం వరకూ చేరుకుంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని జీవితాలు కూడా అంతే. అలాంటి జీవితాలను 'మహాసముద్రం' టైటిల్ తో ఆవిష్కరించడానికి దర్శకుడు అజయ్ భూపతి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ .. అదితీరావు .. సిద్ధార్థ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.


ఈ సినిమాలో అదితీరావు పాత్రకు ప్రాధాన్యత ఎక్కువని తెలుస్తోంది. అందువల్లనే 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆమె ఫస్టులుక్ ను వదిలారు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ .. కన్నీళ్లను వర్షిస్తూ .. తడారిపోయిన పెదలతో ఆమె ఈ ఫస్టులుక్ పోస్టర్ లో కనిపిస్తోంది. తనకి ఎవరో దూరమవుతున్నట్టు .. తాను ఎవరినో విడిచి వెళుతున్నట్టు బాధతో కూడిన భావన ఆమె కళ్లలో కనిపిస్తోంది. ఈ ఫస్టులుక్ ను బట్టి ఈ సినిమాలో ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఎక్కువని అర్థమవుతోంది. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు 19వ తేదీన విడుదల చేయనున్నారు.