Mumbai: వెంటనే వ్యాక్సిన్, మందులు తెప్పించండి మహాప్రభో: మొరపెట్టుకుంటున్న మహారాష్ట్ర డాక్టర్లు

Mumbai Doctor Video Goes Viral on Corona Position
  • మహారాష్ట్రలో కరోనా ప్రమాద ఘంటికలు
  • రోగులకు సరిపడా మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి
  • వైరల్ అవుతున్న లీలావతి ఆసుపత్రి వైద్యుడి వీడియో
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముంబైలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోగా, వారికి కావాల్సిన మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రముఖ లీలావతి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ జలీల్ పార్కర్ మాట్లాడినట్టుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

 సాధారణ రోగులు ఉండాల్సిన ఓ లాబీని బలవంతంగా కరోనా వార్డుగా మార్చారని చెప్పుకొచ్చిన జలీల్ పార్కర్, తమ వద్ద వ్యాక్సిన్లు నిండుకోగా, రోగుల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసరమైన రెమ్ డెసివీర్ ఔషధం కూడా నిండుకుందని తెలిపారు.

"నేను పని చేసే ఆసుపత్రిలో గత మూడు రోజులుగా వ్యాక్సిన్ సరఫరా లేదు. రెమ్ డెసివీర్, తోసిల్ జుబమ్ వంటి ఔషధాలు కూడా నిండుకున్నాయి. వాటి కోసం మేము అడుక్కోవాలి, లేదంటే అప్పు తెచ్చుకోవాలి, కాకుంటే, దొంగతనం చేయాలి" అని ఆయన అన్నారు. ఈ ఔషధాలతో పాటు వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా సరఫరా చేయాలని దేవుడి సాక్షిగా అడుగుతున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడాలంటే, మరో మార్గం లేదని, చర్చలకు బదులుగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

కాగా, మొత్తం 8 అంతస్తుల్లో ఉన్న లీలావతి ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మార్చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ధనవంతులు, పేదలు ఒకటేనని, ఎవరికీ ఔషధాలు లభ్యం కావడం లేదని, వారి ప్రాణాలను కాపాడేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని అన్నారు. సునామీలా పేషంట్లు వచ్చి పడుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన, వారికి సరిపడా పడకల కొరతతో పాటు అవసరమైన వారికి ఆక్సిజన్ ను కూడా అందించలేకున్నామని అన్నారు.

గడచిన సంవత్సరం కాలంగా నర్సులు, వార్డ్ బాయ్ లు, టెక్నీషియన్స్ రోజుల తరబడి రాత్రింబవళ్లు తమ జీవితాలను పణంగా పెట్టి మరీ పని చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు తనతో సహా ప్రతి ఒక్కరూ అలసిపోయారని, తమ కుటుంబాలను కలవాలన్న ఆలోచనను కూడా వారు మరచిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఫోన్, వాట్సాప్ ద్వారా మాత్రమే కుటుంబీకులతో మాట్లాడాల్సి వస్తోందని వాపోయారు. ఈ వీడియోపై అధికారులు స్పందించాల్సి వుంది.
Mumbai
Corona Virus
Leelavati Hospital
For God Sake

More Telugu News